జాజిరి.. జాజిరి.. జాజిరేయ్‌!

 కెరమెరి(ఆసిఫాబాద్‌) : హోలీ పర్వదినంలో భాగంగా మొదటి రోజు పులారా  కార్యక్రమాన్ని ముగించిన ఆదివాసీలు రెండో రోజు మంగళవారం రంగోత్సవం అత్యంత ఘనంగా జరుపుకున్నారు. సోమవారం  కాముని దహనం చేసిన చోటే రాత్రంతా జాగరణ చేశారు. ఆటలు ఆడారు, పాటలు పాడారు. ఆచారాలు, సంస్కృతిని కాపాడుతున్న ఆదివాసీలు మిగతా వారికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. 



‘మాతారి మాతరల్‌’, కాముని దహనం చేసిన బూడిదను ఇతరులు దొంగలించకుండా ఉండడానికి ప్రత్యేకంగా జాగరణ చేశారు. ఇతర గ్రామస్తులు ఈ బూడిదను దొంగలించే ప్రయత్నం చేస్తారు. ఇది వారి ఆచారంలో భాగం. అందుకే వేరేవారు ఎవ్వరూ కాముని దహనం చేసిన బూడిదను దొంగలించకూడదనే ఉద్దేశంతో గ్రామంలోని పురుషులందరూ బూడిదకు రక్షణగా రాత్రంతా జాగరణ చేశారు. అంతకు ముందు కాముడి చుట్టూ సంప్రదాయ ప్రదర్శన చేశారు. సుమారు గంట సేపు డోలు వాయిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.